ఆర్డినెస్స్ ను చించేయటంలో రాహుల్ కమిట్ మెంట్ కనిపించదేం?

Tap to expand
అదేంటో కొందరు చేసే చిన్న పనులు సైతం హైలెట్ అవుతాయి. మరికొందరు అత్యంత అరుదైన పనులు చేసినా ఎవరికి పట్టనట్లుగా ఉంటుంది. చేసింది సాహసోపేతమైన పనైనా పట్టించుకోవటం తర్వాత.. దాన్ని పక్కన పెట్టేసి విమర్శల వర్షం కురిపిస్తుంటారు. కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ విషయంలో మొదట్నించి అలానే జరుగుతుంది. ఆయన్ను తొలుత రాకుమారుడిగా అభివర్ణించి.. ఆ తర్వాత యువరాజుగా ఎత్తి పొడుస్తూనే.. అమూల్ బేబీగా.. పప్పుగా ఎటకారం చేసిన వైనం తెలిసిందే.

చేతిలో అధికారం ఉండి అత్యున్నత పదవిని చేపట్టే వీలున్నా.. తీసుకోని వైనం దేశ ప్రజలకు కనిపించలేదు. అదే మాత్రం హీరోయిజంగా అభివర్ణించలేదు. పదవుల మీద ఆశ లేదన్న విషయాన్ని తెలియజేస్తూ.. ప్రజలు కట్టబెట్టిన ఎంపీ పదవికే పరిమితమయ్యారే తప్పించి.. అంతకు మించి ఎలాంటి తప్పుడు పనులు చేయలేదు. రాహుల్ కమిట్ మెంట్ మీద ప్రశ్నలు వేసే వారు సైతం.. ఆయనకు ఫలానా స్కాంలో సంబంధం ఉందని కానీ.. ఫలానా ఉదంతంలో భారీగా వెనకేసుకున్నారని కానీ వేలెత్తి చూపించటం కనిపించదు.


2004- 2014 మధ్య కాలంలో దేశంలో యూపీఏ సర్కారు హవా ఎంత నడిచిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి వేళ కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ ఎంపీగా ఉన్నారు. తమ కుటుంబమే మన్మోహన్ సర్కారుకు రిమోట్ గా వ్యవహరిస్తున్న వేళలోనూ.. రాహుల్ ఎలాంటి కీలక పదవి తసుకోకుండా ఎంపీగా ఉండిపోయారే కానీ..పదవుల్ని ఆశించలేదు. కానీ.. ఆ విషయాన్ని ఏ మీడియా సంస్థ కూడా ప్రత్యేకంగా ప్రస్తావించదు. గొప్పగా కీర్తించదు. ఇదే పని ఇంకెవరు చేసినా కూడా మరో స్థాయిలో ఉండేది.

రాహుల్ గాంధీని దేశ ప్రజలు మాత్రమే కాదు దేశ మీడియా కూడా ఆయన్ను అర్థం చేసుకునే కన్నా అపార్థం చేసుకున్నదే ఎక్కువ. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గురించి ఏ మాత్రం సానుకూలంగా అక్షరాలు ఉన్నా.. కస్సుమనే వారెందరో. నిజానికి.. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాహుల్ లాంటి వారి అవసరం దేశానికి చాలానే ఉంది. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి పేరును కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన నేరంలో దోషిగా నిరూపితమై.. రెండేళ్లు జైలు శిక్షను ఎదుర్కోవటంతో పాటు.. ఎంపీగా అనర్హత వేటు పడిన వేళ.. పాత విషయాల్ని సరికొత్తగా ప్రస్తావిస్తూ.. ఆయన మీద చేస్తున్న దాడిపై విస్మయం వ్యక్తమవుతుందని చెప్పాలి.

లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాకు మధ్యనున్న న్యాయవివాదానికి సంబంధించిన సుప్రీంకోర్టు 2013లో కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. సదరుకేసు విచారణలో భాగంగా ప్రజాప్రతినిధ్య చట్టంలోని ఒక సెక్షన్ ను కొట్టేసింది. ప్రజా ప్రాతినిధ్యం చట్టం సెక్షన్ 8(4) ప్రకారం ఏదైనా క్రిమినల్ కేసులో రెండు లేదంటే అంతకంటే ఎక్కువ కాలం జైలుశిక్ష పడిన ప్రజాప్రతినిధికి ఒక వెసులుబాటు ఉంది.

అదేమంటే.. శిక్షకు సంబంధించిన తీర్పు వెలువడిన వెంటనే సదరు ప్రజా ప్రతినిధిని అనర్హుడిగా ప్రకటించటానికి వీల్లేదు. అప్పీలు చేసుకోవటానికి 3 నెలల టైంతో పాటు హైకోర్టు కనుక స్టే ఇస్తే.. ఆ అనర్హత నిర్ణయాన్ని వాయిదా వేయాలని సదరు సెక్షన్ చెబుతోంది. అయితే.. లిల్లీ థామస్ కేసులో ఈ కీలకమైన సెక్షన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. అప్పట్లో కేంద్రంలో యూపీఏ2 సర్కారు అధికారంలో ఉంది.

కూటమిలో మిత్రుడైన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ దాణా స్కాంలో ఇరుకొన్ని దోషిగా నిరూపితం కావటం తెలిసిందే. దీంతో.. ఆయనకు రెండేళ్ల జైలుశిక్ష పడింది. ఆయనపై అనర్హత వేటు పడింది. దీంతో తన మిత్రుడ్ని రక్షించుకోవటానికి యూపీఏ సర్కారు ముందుకు వచ్చింది. సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ప్రత్యేక చట్టసవరణ చేసింది. ఇందులో భాగంగా జెట్ స్పీడ్ తో ఒక ఆర్డినెన్స్ ను తీసుకొచ్చింది. ఇది.. సుప్రీంకోర్టు తొలగించిన సెక్షన్ 8(4)కు దగ్గరగా ఉంటుంది. దీంతో.. లాలూకు హైకోర్టును ఆశ్రయించే వీలు కలిగించింది.అయితే.. దీనిపై రాహుల్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు.. సదరు ఆర్డినెన్స్ అర్థం లేనిదంటూ ఫైర్ కావటమే కాదు.. మీడియా సమావేశాన్ని ఏరపాటు చేసి మరీ అదో చెత్త ఆర్డినెన్స్ అంటూ దాని కాపీని అందరి ముందు చించేశారు.

ఈ ఉదంతం అప్పట్లో సంచలనంగా మారింది. ఎందుకంటే.. అప్పట్లో ప్రధానిగా వ్యవహరిస్తున్న మన్మోహన్ కు ఉన్న ఇమేజ్ ఎలాంటిదో అందరికి తెలిసిందే. అలాంటి ఆయన ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను చించేయటం ద్వారా.. దాన్ని తీవ్రంగా తప్పుపట్టారు రాహుల్. సొంత ప్రభుత్వం తెచ్చిన ఆర్ఢినెన్స్ ను తప్పు పట్టటం ద్వారా.. చించేయటం ద్వారా మామూలుగా అయితే హీరో కావాలి. కానీ.. అప్పట్లోనూ ఆయన చర్యను పలువురు తప్పు పట్టారు. ఇదేం తీరు అని విమర్శించటంతో పాటు.. అహంకారాన్ని ప్రదర్శించారని మండిపడిన వాళ్లు ఉన్నారు.

కానీ.. ఈ మొత్తం ఎపిసోడ్ ను నిశితంగా చూస్తే..ఆయన చర్యను అభినందించాలి కదా? కోర్టు ఇచ్చిన తీర్పు కారణంగా తమ కూటమిలోని ఒక రాజకీయ అధినేతకు కష్టం వస్తే కాపాడాల్సిన దాని కంటే.. సుప్రీంతీర్పును తప్పు పట్టే ధోరణిని  అడ్డుకున్న తీరును అభినందించాల్సిందే. సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైనా సరే.. తమకు అనుకూలంగా చట్టాల్ని మార్చుకోవటానికి ప్రాధాన్యత ఇస్తారు. అందుకు భిన్నంగా అభినందించాల్సింది పోయి ఆయన్ను అప్పట్లో అహంకారవాదిగా ముద్ర వేశారు. రాహుల్ ఆగ్రహంతో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం దాన్ని వెనక్కి తీసుకుంది.

కట్ చేస్తే.. అప్పట్లో జారీ చేసిన ఆర్డినెన్స్ ను రాహుల్ కానీ వ్యతిరేకించకుంటే.. అదిప్పటికి చట్టంగా మారేది. తాజా కేసులో ఆయనకు రక్షణ కవచంలా ఉండేది. దీంతో.. పలువురు ఆయన చేసిన పనిని ఇప్పటికి విమర్శిస్తున్నారే తప్ప.. తన చర్య కారణంగా తానే ఇబ్బందుల్లోపడినందుకు సానుభూతి వ్యక్తం కాకపోవటం గమనార్హం.
Show comments
More