మాజీ సీఎం కిరణ్ కుమార్ కు బంపర్ ఆఫర్?

Tap to expand
టీడీపీ అధినేత చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం ఆయన్ను ఎంతలా విమర్శలకు గురి చేస్తుందో.. అంతకు వెయ్యి రెట్లు ఎక్కువగా విభజన విషయంలో కాంగ్రెస్ అనుసరించిన దానికి ఏపీలో పార్టీ నామరూపాల్లేకుండా పోయిన సంగతి తెలిసిందే. విభజన చేయటం ద్వారా.. ఒకట్రెండు టర్మ్ లు అధికారం మిస్ అయినా.. తర్వాత సొంతం చేసుకోవచ్చన్న ఆలోచన చేసిన కాంగ్రెస్ అధినాయకత్వానికి.. అంతా కాలిపోయిన తర్వాత కానీ తత్త్వం బోధ పడని పరిస్థితి. దీంతో బిక్కచచ్చిపోయిన కాంగ్రెస్ నేతలు ఒక్కో దిక్కుకు ఒక్కోరు చొప్పున వెళ్లిపోయారు.

కొందరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళితే.. బాబు మీద అపార నమ్మకంతో మరికొందరు టీడీపీలో చేరిపోయారు. ఈ రెండు కాదు.. మోడీ మేజిక్ తో ఏదో అవుతుందన్న ఆశతో బీజేపీకి వెళ్లిపోయినోళ్లు ఉన్నారు. ఇదిలా ఉంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తప్పించి.. మిగిలిన పార్టీలోకి వెళ్లిన వారందరికి తలబొప్పి కట్టే అనుభవాలు ఎదురు కావటం.. అంచనాలకు భిన్నంగా ఏపీలో చంద్రబాబు పుంజుకోవటానికి అవకాశం లేదన్న భావన అంతకంతకూ పెరిగిపోతుందట.

ఈ నేపథ్యంలో పాత కాంగ్రెస్ నేతలంతా కలిసి.. సరికొత్తగా ఏదైనా చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. టీడీపీ.. బీజేపీలోకి వెళ్లిన వారంతా కలిసి పాత కాంగ్రెస్ లోకి వస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ లో చేరితే.. తమ రాజకీయ భవిష్యత్తు అంతో ఇంతో ఆశాజనకంగా ఉంటుందన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

ఈ ఫార్ములాకు కాంగ్రెస్ పాత కాపులు..జేసీ.. కావూరి.. రాయపాటి.. పురంధేశ్వరి.. రఘువీరా.. రాయలసీమకు చెందిన మరికొందరునేతలంతా కలిసి ఒక మీటింగ్ పెట్టుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి కిరణ్ ను నాయకత్వం వహించాల్సింది కోరాలన్న ఆశతో ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కిరణ్ తో కలిసి తామంతా ఒక తాటి మీదకు వస్తే.. తమ రాజకీయ భవిష్యత్తుకు ఢోకా ఉండదన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇదంతా చూసినప్పుడు.. కిరణ్ కుమార్ రెడ్డికి బంఫర్ ఆఫర్ అన్న భావన కలుగక మానదు. వేర్వేరు పార్టీలో చేరి.. ఉన్న ఇమేజ్ ను పోగొట్టుకున్న నేతలంతా కలిసి కిరణ్ ను లీడ్ చేయమంటే.. అందుకు ఆయన ఎలా రియాక్ట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది.
Show comments