బలగం

Tap to expand
'బలగం' మూవీ రివ్యూ
నటీనటులు: ప్రియదర్శి-కావ్య కళ్యాణ్ రామ్-వేణు వెల్దండి-రచ్చ రవి తదితరులు

సంగీతం: భీమ్స్ సిసిరోలియో

ఛాయాగ్రహణం: ఆచార్య వేణు
నిర్మాతలు: హర్షిత్ రెడ్డి-హన్సిత రెడ్డి
రచన-దర్శకత్వం: వేణు వెల్దండి

టాలీవుడ్లో భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన అగ్ర నిర్మాత దిల్ రాజు నుంచి వచ్చిన చిన్న సినిమా 'బలగం'. కమెడియన్ గా మంచి పేరు సంపాదించిన వేణు యల్దండి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ: సాయిలు (ప్రియదర్శి) తెలంగాణలోని ఒక పల్లెటూరికి చెందిన కుర్రాడు. ఏదో ఒక బిజినెస్ చేసి జీవితంలో ఎదగాలని చూసే అతను.. తండ్రి పొలం అమ్మిన డబ్బుకు తోడు.. ఆ తర్వాత అప్పులు చేసి తెచ్చిన పెట్టుబడి పెట్టి రకరకాల వ్యాపారాలు చేస్తాడు. కానీ అవేవీ ఫలితాన్నివ్వవు. ఇంతలో అతడి పెళ్లి ఖరారవుతుంది. ఆ పెళ్లితో వచ్చే కట్నంతో అప్పులు తీర్చాలని చూస్తున్న సమయంలో.. సాయిలు తాత చనిపోతాడు. అదే సమయంలో చిన్న గొడవ జరిగి సాయిలు పెళ్లి కూడా రద్దవుతుంది. అప్పులు కట్టడానికి ఏం చేయాలో పాలుపోని స్థితిలో బాగా డబ్బున్న తన సొంత మేనత్త కూతురు సంధ్య (కావ్య కళ్యాణ్ రామ్)ను పెళ్లి చేసుకుని తన కష్టాలు తీర్చుకోవాలని అనుకుంటాడు సాయిలు. మరి అతడి ప్రయత్నాలు ఏమేర ఫలించాయి.. కావ్యతో పెళ్లికి అందరినీ అతను ఒప్పించగలిగాడా.. తాత మరణానంతరం ఇంట్లో తలెత్తిన పరిణామాలు ఏంటి.. ఇవన్నీ తెరమీదే చూసి తెలుసుకోవాలి.

కథనం-విశ్లేషణ: కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ టాలీవుడ్. ఈ తరహా సినిమాల్లో ఇండియాలో మనల్ని కొట్టేవాళ్లు ఎవ్వరూ లేరు. ఐతే మన మూలాల్ని గుర్తు చేస్తూ.. మన పల్లెటూళ్లలో పరిస్థితుల్ని.. అక్కడి మనుషులను ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నాలు తెలుగులో బాగా తగ్గిపోయాయి. 90వ దశకం వరకు మన దగ్గరా పల్లెటూరి కథలు చాలానే తెరకెక్కినా అవి సినిమాటిక్ గానే ఉండేవి. డ్రామా పాళ్లు తక్కువగా ఉండి అత్యంత సహజంగా పల్లెటూరి కథల్ని తెరపైకి తెచ్చే ప్రయత్నాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఐతే ఇతర భాషల నుంచి స్ఫూర్తి పొందుతున్నారో.. లేక సొంత ఆలోచనలతోనే ప్రయత్నిస్తున్నారో కానీ.. సీమ నేపథ్యంలో 'సినిమా బండి'.. ఉత్తరాంధ్ర నేపథ్యంలో 'జయమ్మ పంచాయితీ' లాంటి సహజమైన పల్లె కథలు ఇటీవల కాలంలో తెరపైకి వచ్చాయి. కానీ వాటికి కోరుకున్నంత రీచ్ అయితే రాలేదు. ఐతే ఇప్పుడు దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాత.. ఒక స్వచ్ఛమైన పల్లెటూరి కథకు అండగా నిలిచాడు. కమెడియన్ వేణు వెల్దండి.. తనలోని మరో కోణాన్ని చూపిస్తూ ఈ తెలంగాణ మట్టి కథను అందంగా.. ఆసక్తికరంగా తెరపై ప్రెజెంట్ చేశాడు. నిజాయితీతో కూడిన ఈ ప్రయత్నం ప్రేక్షకులకు కచ్చితంగా ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది. ఒక పల్లెటూరిలో అడుగు పెట్టి అక్కడి మనుషుల మధ్య తిరుగుతూ అక్కడ జరిగే యవ్వారాల్ని తాపీగా చూస్తున్న భావన కలిగిస్తుంది 'బలగం'. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను చూసే కోణంలో కాకుండా సహజత్వంతో కూడిన ఒక పల్లెటూరి కథను చూడాలనుకుంటే 'బలగం' మంచి ఛాయిసే.

కన్నడలో 'తిథి' అని ఎనిమిదేళ్ల కిందట ఒక చిన్న సినిమా సంచలనం రేపింది. ఆ సినిమా తీసింది తెలుగువాడైన రామ్ రెడ్డినే. అది ఒక 'చావు' చుట్టూ తిరిగే సిినిమా కావడం విశేషం. చావు అంటే అదేదో ఏడుపుగొట్టు సినిమా అనుకుంటే పొరబాటే. ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతూ.. ఆఖర్లో చిన్న ఎమోషనల్ టచ్ ఇచ్చి హృదయాల్ని తడి చేసే సినిమా అది. కమెడియన్ వేణు 'బలగం' తీయడానికి బహుశా ఆ చిత్రమే స్ఫూర్తి అయి ఉండొచ్చు. ఐతే అతను స్ఫూర్తి మాత్రమే పొందాడు.. దాన్ని కాపీ కొట్టలేదు. అతను రాసిన కథ కూడా చావు చుట్టూ తిరిగేదే. ఒక వ్యక్తి మరణంతో మొదలై ఆయన దశ దిన కర్మ వరకు జరిగే తంతునే ఈ సినిమాలో చూస్తాం. కానీ సినిమాలో వినోదానికి ఢోకా లేదు. డ్రామా కూడా బాగానే పండింది. ఆఖర్లో ఎమోషన్లను కూడా బాగానే పండించి.. ఒక మంచి సందేశాన్ని కూడా ఇచ్చాడు వేణు. కాకపోతే మధ్య మధ్యలో సాగతీతను.. రిపిటీటివ్ గా అనిపించే సీన్లను మాత్రం కొంచెం భరించాల్సి ఉంటుంది.

పట్టణీకరణ ప్రభావం పడకుండా ఉన్న ఒక తెలంగాణ పల్లెటూరిలో అక్కడి మనుషులు.. వారి తీరును ఉన్నదున్నట్లుగా చూపిస్తుంది 'బలగం'. పల్లెటూరి వాడే అయిన వేణు.. తాను చూసిన విషయాలు.. మనుషులనే ఈ కథలోకి తీసుకొచ్చినట్లు అనిపిస్తుంది. తెరపై కనిపించే ఎవ్వరూ నటుల్లా కనిపించరు. వాళ్లు నటిస్తున్నట్లూ అనిపించదు. నిజంగా పల్లెటూరి మనుషుల్ని దగ్గరుండి చూస్తున్న భావన కలుగుతుంది. అంత సహజంగా అనిపిస్తాయి పాత్రలు.. వాటి తీరుతెన్నులు.. వాళ్లు మాట్లాడే మాటలు. పల్లెటూరిలో ఒక పెద్ద మనిషి చనిపోతే.. చావు దగ్గర్నుంచి దినం వరకు జరిగే రకరకాల తంతుల చుట్టూనే నడుస్తుంది సినిమా అంతా. చావు దగ్గర ఆడవాళ్ల ఏడుపులు.. బంధువుల మధ్య పట్టింపులు.. దినం లోపు మధ్య మధ్యలో భోజనాలు.. మందుబాబుల దావత్ లు.. ఇలాంటి వాటి చుట్టూనే సన్నివేశాలు నడుస్తాయి. వీటన్నింట్లోనూ వీలైనంత మేర వినోదం పండించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. సన్నివేశాల్లో సహజత్వమే అతి పెద్ద ఆకర్షణగా సినిమా ముందుకు నడుస్తుంది.

పిండాన్ని కాకి ముట్టకపోవడం అనే పాయింట్ చుట్టూ నడిపిన డ్రామా బాగుంది. చనిపోయిన వ్యక్తి అసంతృప్తి ఏంటో తెలుసుకుని.. దాన్ని తీర్చడానికి కుటుంబ సభ్యులు రకరకాల ప్రయత్నాలు చేసి.. చివరికి ఆ అసంతృప్తిని పొగొట్టడానికి ఏం చేశారనే విషయాన్ని హృద్యంగా చూపించారు. ఆఖర్లో మెలో డ్రామా కొంచెం ఎక్కువైనట్లు అనిపించినా అదేమంత సమస్య కాదు. ఎమోషన్ అయితే బాగా పండింది. తెలంగాణలో అల్లుళ్లను ఎలా గౌరవిస్తారు.. ఆ గౌరవం తగ్గితే అల్లుళ్ల అలకలు ఎలా ఉంటాయి.. చిన్న మాట పట్టింపుతో కుటుంబాలు ఎలా విచ్ఛిన్నం అవుతాయి.. ఇలాంటి విషయాలను చక్కగా చూపించాడు వేణు. తెలంగాణ మట్టి వాసనను చూపించేలా నేటివిటీ.. డైలాగులు.. పాటల విషయంలో అతను పెట్టిన శ్రద్ధ ఆకట్టుకుంటుంది. ఆరంభంలో చాలా వరకు సరదాగా సాగిపోయే సీన్ల వల్ల కథనంలో వేగం కనిపిస్తుంది కానీ.. మధ్యలో మందగమనం ఇబ్బంది పెడుతుంది. చూసిన సన్నివేశాలనే మళ్లీ మళ్లీ చూస్తున్నట్లు అనిపిస్తుంది. కథ ముందుకు కదల్లేదనే భావన కలుగుతుంది. కానీ చివరి అరగంటలో వేణు దీన్ని కవర్ చేసేశాడు. తెలంగాణ వాళ్లు ఈజీగా ఈ సినిమాతో కనెక్ట్ అవుతారు. కానీ ఇక్కడి సంస్కృతి.. మనుషుల గురించి తెలియాలంటే.. వాళ్లను అర్థం చేసుకోవాలంటే ఇతర ప్రాంతాల వాళ్లు ఈ సినిమా చూడాలి. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల తరహాలో లేకపోయినా.. వినోదం.. ఎమోషన్లు కూడా బాగానే పండిన 'బలగం' ఒక ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.

నటీనటులు: పేరుకు ప్రియదర్శి.. కావ్య కళ్యాణ్ రామ్ ఇందులో హీరో హీరోయిన్లే కానీ.. వాళ్లను ఆ కోణంలో చూపించలేదు. మిగతా పాత్రల్లో ఇవీ ఉన్నట్లుగా అనిపిస్తాయి. వీళ్లిద్దరే కాదు.. సినిమాలో కనిపించే ఏ నటుడూ నటుడిలా అనిపించరు. అందరూ కూడా పాత్రల్లో ఒదిగిపోయి సహజంగా నటించారు. ప్రియదర్శి.. కావ్యలతో పాటు అందరూ చాలా బాగా నటించారు. హీరో హీరోయిన్ల తండ్రుల పాత్రల్లో నటించిన వాళ్లు ఇద్దరూ చాలా బాగా చేశారు. హీరోయిన్ తల్లి పాత్రలో చేసిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా మెప్పించింది. దర్శకుడు వేణు కూడా చిన్న పాత్రలో మెరిశాడు. రచ్చ రవితో పాటు హీరో ఫ్రెండుగా నటించిన మరో కుర్రాడు కూడా బాగా చేశాడు. మిగతా నటీనటులందరూ కూడా ఆకట్టుకున్నారు.

సాంకేతిక వర్గం: టెక్నీషియన్స్ అందరూ కూడా ఈ కథను అర్థం చేసుకుని అందుకు తగ్గ ఔట్ పుటే ఇచ్చారు. భీమ్స్ సిసిరోలియో.. 'ధమాకా' లాంటి పక్కా కమర్షియల్ మూవీ తర్వాత ఈ సినిమాతో ఆశ్చర్యానికి గురి చేశాడు. తెలంగాణ జానపదాలు.. పల్లె పాటల తరహాలో మంచి పాటలు సమకూర్చాడు. టైటిల్స్ సమయంలో వచ్చే పాటతో పాటు అన్నీ ఆకట్టుకుంటాయి. రామ్ మిరియాల పాడిన 'పొట్టి' పాట వినసొంపుగా ఉంది. నేపథ్య సంగీతం కూడా నేటివిటీ టచ్ తో సాగింది. ఆచార్య వేణు విజువల్స్ కూడా ఆకట్టుకుంటాయి. దిల్ రాజు సినిమా కాబట్టి 'రిచ్'గా ఉండాలనేమీ ప్రయత్నించలేదు. సెట్టింగ్స్ లాంటి వాటి జోలికి వెళ్లకుండా.. ఒక పల్లెటూరిలో ఈ కథకు తగ్గట్లుగా సహజమైన వాతావరణంలో తీశారు. భారీ కమర్షియల్ సినిమాలు తీసే రాజు.. ఇలాంటి చిత్రానికి మద్దతుగా నిలవడం అభినందనీయం. కమెడియన్ వేణు దర్శకుడిగా మంచి ముద్రే వేశాడు. సినిమా అంతా అయ్యేసరికి వేణులో ఇంత టాలెంట్ ఉందా అని ఆశ్చర్యపోకుండా ఉండలేం. అతను తన అనుభవంలోని విషయాల చుట్టూనే ఒక కథను అల్లి.. వినోదంతో పాటు ఎమోషన్లను పండించగలిగాడు. నరేషన్ కొంచెం స్లో అని తప్పితే 'బలగం' విషయంలో అతడి మీద పెద్ద కంప్లైంట్లేమీ లేవు.

చివరగా: తెలంగాణ మట్టి కథ

రేటింగ్-2.75/5
Show comments
More