బీజేపీ ఆ పని చేసి ప్రతిపక్షాల నెత్తిన పాలుపోసిందా?

Tap to expand
కేంద్రంలో 2014లో బీజేపీ ప్రభుత్వం.. కాదు కాదు.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆయన ధాటికి ప్రతిపక్షాలు కుదేలయ్యాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తో సహా మహామహులు.. అఖిలేష్ యాదవ్ .. సమాజ్ వాదీ పార్టీ మాయావతి.. బహుజన్ సమాజ్ పార్టీ లాలూప్రసాద్ యాదవ్.. ఆర్జేడీ మమతా బెనర్జీ.. తృణమూల్ కాంగ్రెస్ అరవింద్ కేజ్రీవాల్.. ఆమ్ ఆద్మీ శరద పవార్.. ఎన్సీపీ ఫరూక్  అబ్దుల్లా.. నేషనల్ కాన్ఫరెన్స్ దేవగౌడ.. జేడీఎస్ హేమంత్ సోరెన్.. జార్ఖండ్ ముక్తి మోర్చా ఉద్దవ్ థాకరే.. శివసేన తదితర పార్టీలు మోడీ ప్రభంజనం ధాటికి కకావికలమయ్యాయి.

ఇక వరుసగా రెండోసారి 2019లో కూడా ప్రధాని మోడీ ప్రభంజనం 2014లో కంటే బలంగా వీచింది. ఈ ధాటికి బలమైన ప్రతిపక్షాలు సైతం చిగురాకుల్లా వణికాయి. 2024 ఎన్నికల నాటికి కూడా మోడీని ఎదుర్కోగల ప్రతిపక్షాలు లేవనే భావన నెలకొంది. ఇప్పటిదాకా బీజేపీయేతర ఫ్రంట్ అని కొందరు కాంగ్రెసేతర ఫ్రంట్ అని మరికొందరు జీ-8 సీఎంల కూటమి అని కొందరు... ఇలా ఎవరికి వారుగా ప్రతిపక్షాలన్నీ చీలిపోయి ఉన్నాయి. ఇదే పరిస్థితి ఉంటే 2024లోనూ బీజేపీ ప్రభంజనాన్ని ఆపలేరనే పరిస్థితులు ఉన్నాయి.


ఇలాంటి స్థితిలో ప్రతిపక్షాల నెత్తిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పాలుపోసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అప్పుడెప్పుడో 2018లో దేశంలో దొంగల ఇంటి పేరంతా మోడీనే అని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం.. దీనిపై గుజరాత్ బీజేపీ నేత ఒకరు సూరత్ కోర్టులో పిటిషన్ వేయడం.. కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష వేయడం జరిగిపోయాయి. అయితే రాహుల్ పై కోర్టులో అప్పీల్ చేసుకోవడానికి వీలుగా సూరత్ కోర్టు నెల రోజుల సమయం ఇచ్చింది.

ఇంతలోనే యుద్ధప్రాతిపదికన ఆగమేఘాల మీద.. కొంపలేవో అంటుకుపోతున్నట్టు లోక్ సభ సెక్రటేరియట్ రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష పడటంతో ఆయనను లోక్ సభ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటిస్తూ నోటిఫికేషన్ కూడా జారీ చేసేసింది. ఈ నిర్ణయంపై దేశ స్థాయిలో తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. కాంగ్రెస్ పొడగిట్టని నేతలు కూడా ఈ విషయంలో రాహుల్ గాంధీకి సంఘీభావంగా నిలిచారు. దేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని.. నియంతృత్వం రాజ్యమేలుతోందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి.

ఇంకోవైపు బీజేపీ ప్రభుత్వం.. ఎనఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఆదాయ పన్ను శాఖ (ఐటీ)లతో ప్రతిపక్ష నేతలపై దాడులు చేయిస్తోందని.. కక్షపూరితంగా వ్యవహరిస్తోందని 14 ప్రతిపక్ష పార్టీలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.

ఇన్నాళ్లూ బీజేపీకి సమాన దూరం కాంగ్రెస్ కు సమాన దూరం అంటూ ప్రకటిస్తూ వచ్చిన తెలంగాణ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం రాహుల్ గాంధీకి బాసటగా నిలిచారు. ఆయన లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయడంపై కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఒక్కటే ఒక పక్షంగా ప్రతిపక్షాలన్నీ ఒక పక్షంగా మారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఒక రకంగా వేటికవే విడివిడిగా ఇప్పటిదాకా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రతిపక్షాల నెత్తిన బీజేపీ ప్రభుత్వమే పాలు పోసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలన్నీ కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతోపాటు ఆ పార్టీ మిత్ర పక్షాలుగా ఉన్న డీఎంకే ఎన్సీపీ శివసేన (ఉద్ధవ్ థాకరే) జార్ఖండ్ ముక్తి మోర్చా వంటివి జేడీయూ వంటివి ఆందోళనలకు నిరసనలకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో వీటికి బీఆర్ఎస్ ఎన్సీపీ తృణమూల్ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ సమాజ్వాదీ బహుజన్ సమాజ్ వాదీ వంటి పార్టీలన్నీ జతకూడనున్నాయి. దీంతో దేశ రాజకీయం ఒక్కసారిగా మలుపుతిరిగింది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ప్రతిపక్షాలన్నీ ఒక్కటయితే బీజేపీకి ఇక దబిడ దిబిడేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Show comments
More